Close

పురాణాలు–నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణాలు–నేడు ఎలా తెలుసుకోవాలి?

గతవారంలో దేవీనవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అనే వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూలగ్రంథాలైన ఉపనిషత్తుల్లో చెప్పిన సిద్ధాంతం నేపథ్యంలో ఆనాటి సామాన్య మానవుడికై వ్రాయబడ్డ పుస్తకాలు. వీటన్నింటినీ వ్యాసుడొక్కడే వ్రాశాడని కొందరు, అనేకులు వ్రాశారని మరికొందరి వాదన. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడి గూర్చి గొప్పగా చెప్పడం చూడగలం.

వేదాంతం చదవనంతవరకూ పురాణకథల్ని అక్షర సత్యాలుగా భావిస్తాం లేదా అసత్యాలుగా కొట్టిపారేస్తాం. వేదాంతం కొంత చదివిన తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. విశ్వమంతా చైతన్యమనే మహాసముద్రంలో కనిపించే అలలాంటిది అన్నపుడు శ్రీదేవి ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు, ఈ చైతన్య సాగరంలో వీరి స్థానమేమిటి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే ప్రశ్నలు వస్తాయి.

విశాలమైన భరతఖండంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంప్రదాయాలు వెలిసినట్టు మనం గమనించగలం. వేదాల్లో పలుచోట్ల విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన పేర్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే తత్త్వానికి వేరు వేరు పేర్లు మాత్రమే. కానీ సమాజంలో మాత్రం ఒకప్రాంతంలో విష్ణువుకు ప్రాముఖ్యం, మరొకచోట శివుడికి ప్రాముఖ్యం, మరొకచోట శక్తి –ఈవిధంగా సంప్రదాయాలు ఉన్నట్లు ఊహించగలం. ఈ సంప్రదాయాలకు అనుగుణంగా పురాణాలు వచ్చాయి. విష్ణువు గొప్పదనాన్ని చెప్పేవి కొన్ని, శివుడు గొప్ప అని చెప్పేవి కొన్ని, శక్తి లేదా గణపతి గొప్ప అని చెప్పేవి మరికొన్ని కనిపిస్తాయి. ఈ పురాణాలన్నీ వేదవ్యాసుడు వ్రాసినా, మరొకరు వ్రాసినా ఉపనిషత్తుల్లో చెప్పిన వేదాంతసిద్ధాంతంతో తమ తమ సంప్రదాయాల్ని జోడించడం, దానికి ప్రామాణ్యం కల్పించడం ఆయా రచయితల ప్రణాళిక.

ఉపనిషత్తుల్లో ప్రపంచమంతా శుద్ధచైతన్యంలో ఏర్పడే ఒకానొక దృశ్యంలాంటిదని చెబుతారు. చైతన్యంలో ఉన్న సృజనశక్తియే జడపదార్థంగా కనిపిస్తూందని అర్థం. ఈ కనిపించే ప్రక్రియ గూర్చి ఇదివరలో ‘ప్రపంచం ఎలా వచ్చింది’ అనే వ్యాసంలో చూశాం. ఈ శుద్ధచైతన్యమే శివుడనీ, అందులోని సృజనశక్తియే పరాశక్తి అని శైవ సంప్రదాయంవారు, అలాకాక శుద్ధచైతన్యం విష్ణువనీ, సృజనశక్తియే విష్ణుమాయ అని వైష్ణవులు, పరాశక్తియే చైతన్యమూ, అందులోని సృజనశక్తి అంటూ శక్తిసంప్రదాయంవారు చెబుతూ తమ సంప్రదాయం యొక్క structureను ఉపనిషత్తు సిద్ధాంతంతో (embedding)కలిపివేశారు.

ఇది భారతీయ సమాజంలో జరిగిన అద్భుత ప్రక్రియ. విశ్వాసాలు వేరువేరుగా ఉన్నపుడు ఇతరదేశాల చరిత్రల్లో మనం చూసేవి యుద్ధాలు, రాజకీయబలంతో ఏదో ఒక విశ్వాసం బలపడి స్థిరం కావడం. భారతీయ సమాజంలో అలాకాకుండా విభిన్న సంప్రదాయాలు శాంతియుతంగా ఉపనిషత్ సిద్ధాంతము అనే గొడుగు క్రిందికి వచ్చాయి. ఒక్క వ్యాసుడే ఈ పని చేశాడంటే అతను నిజంగా అద్భుతమైన రీతిలో సమాజాన్ని ఏకం చేశాడని చెప్పవచ్చు. అలాగాక ఆయా సంప్రదాయాల ఋషులు వాటిని వ్రాశారంటే వారి శాంతికాముకత, సమన్వయదృష్టి అమోఘమైనవని చెప్పాలి. (సమాజం వేదాంత భావాలకు దూరమైన తర్వాత ఈ సమన్వయభావం లోపించి 15వ శతాబ్దం తర్వాత వైష్ణవులు, శైవుల మధ్య సంఘర్షణలు కొన్నిప్రాంతాల్లో జరిగాయి)

21వ శతాబ్దంలో మనకెందుకీ పురాణాలు అని ప్రశ్నించవచ్చు. నిజమే, మనకు గొప్పగా అక్కరలేకపోవచ్చు. అభిరుచి ఉన్నవాళ్ళు సంతోషంగా వాటిని చదివి కొన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు లేదా మానవచ్చు. అయినా చాల అనూహ్యంగా వీటిగూర్చి తెలుసుకోవాల్సిన సామాజిక అవసరం ఏర్పడింది.

అనేక పాశ్చాత్య విద్యాలయాల్లో comparative mythology అనే విభాగాల్ని కొత్తగా ప్రారంభించి వివిధ దేశాల్లోని పురాణ కథలపై పరిశోధనలు, రచనలు జరుపుతున్నారు. ఇటీవలే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక ప్రొఫెసర్ ‘The Origin of World Mythologies’అనే పుస్తకం వ్రాశారు. ప్రపంచంలో అందరూ మన పురాణాలు చదవడం సంతోషించదగిందే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ రచయితలు చాలమంది పురాణాల నేపథ్యం, వాటి వెనుక ఉన్న తాత్త్వికసిద్ధాంతం పక్కన ఉంచి పురాణకథలకు జాతుల మధ్య పోరాటంగా చెప్తున్నారు లేదా అశ్లీలమైన, అనాగరికమైన, హానికరమైన అర్థాల్ని చెప్తున్నారు. ఇది కొత్తవిషయం కాదు. బ్రిటిష్ పాలన సమయంలోనే మ్యాక్స్ ముల్లర్ మొదలుగా చాలమంది రచయితలు చేసిన పనే. దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధాల్ని ఆర్యులు, ద్రావిడులు అనే రెండు జాతుల మధ్య జరిగిన యుద్ధాలు అని వ్యాఖ్యానించి దేశప్రజల్ని అనేక వర్గాలుగా విడగొట్టడంలో సాఫల్యం చెందారు. ఇదే వైఖరి ఇటీవలి కాలంలో మరింత పెరగడం గమనించదగింది. ఉదాహరణకు Paul Courtright అనే అతను వినాయకుడిపై ఒక పుస్తకాన్నే వ్రాశాడు. ఇందులో కేవలం అశ్లీలతకే ప్రాధాన్యం. కోట్లాది ప్రజలు భక్తితో పూజించే వినాయకుడిని, పార్వతినీ, శివుడిని అశ్లీలంగా వ్యాఖ్యానించాడు. అలాగే సీతను, హనుమంతుణ్ణి గూర్చి జుగుప్సాకరంగా వ్రాశాడు. Wendy Doniger అనే రచయిత్రి ఇలాంటి వ్యాఖ్యల్నే చేసి పెద్ద పెద్ద పుస్తకాల్ని ప్రచురించింది. ఈవిడ వ్రాసిన ఒకానొక పుస్తకాన్ని ఇటీవల పెంగ్విన్ ప్రచురణకర్తలు వెనక్కి తీసుకోవడం కూడా పాఠకులు గమనించి ఉండవచ్చు.

పై పుస్తకాల ప్రభావం మన దేశంలోని మేధావి వర్గంపై పడుతుంది. మన మేధావివర్గం మన సంస్కృతినుంచిచాలమటుకు దూరమైపాశ్చాత్యసంస్కృతికి చేరువలో ఉంది. కానీ దురదృష్టవశాత్తూ వీరే సమాజంలో ప్రజాభిప్రాయాన్ని నిర్మించేవారు (opinion makers). వీరు విశ్వవిద్యాలయాలు, మీడియా మొదలగు అనేకరంగాల్లోని ప్రముఖులు. వీరికి మన సంస్కృతిపై ద్వేషం లేదు అయినా యాదృచ్ఛికంగా సంస్కృతికి దూరం కావడంవల్ల, మన సంస్కృతిపై అవగాహన కల్గించేవారు లేకపోవడం వల్ల,  పైన చెప్పిన రచనలతో ప్రభావితం అవుతున్నారు. అలాంటి భావాలతోనే తమ రచనల్ని కూడా చేస్తారు.

దీనికి జవాబు ఏమిటి?మన సంస్కృతిని బాగా తెలుసుకున్న సాంప్రదాయ పండితులకు పైవిధంగా రచనలు జరుగుతున్నాయన్న విషయం తెలియదు. వీరికి సంస్కృతంలో అసాధారణమైన పాండిత్యం ఉండవచ్చు కానీ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎలాంటి రచనలతో ప్రభావితమౌతున్నారనే విషయం వీరికి అవగాహన లేదు. మన సమాజంలో ఇన్నేళ్ళుగా వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడిన రామాయణం, భారతంలాంటి పుస్తకాలు, పురాణాలపై సరైన అవగాహన కల్గించడం ప్రస్తుత అవసరం. ఒక చిన్న ఉదాహరణ చూస్తే దేవతలు, రాక్షసులంటే సినిమాలలో చూపినట్టు ఆకాశంలో నిలబడి యుద్ధాలు చేసుకునేవాళ్ళు కాదు, మరేమిటి అంటే –“దేవాః శాస్త్రోద్భాసితా ఇంద్రియవృత్తయః, అసురాః తద్విపరీతాః”అని ఉపనిషత్తుల వ్యాఖ్యల్లో చెప్పారు. శాస్త్రంచేత సంస్కరింపబడిన మనోభావాలే దేవతలనీ, సంస్కరింపబడని భావాలు రాక్షసులనీ దీని అర్థం. అదే సందర్భంలో దేవాసుర సంగ్రామం అంటే ప్రతిమనిషి మనస్సులో మంచి ఆలోచనలకూ, చెడు ఆలోచనలకూ ఎల్లప్పుడూ జరిగే ఆధ్యాత్మిక సంగ్రామం అన్నారు. ఇలాగే ప్రతిపురాణంలోనూ ఆయాదేవతల గూర్చిన సింబాలిజం అక్కడక్కడా చెప్పబడి ఉంది. వీటిని మామూలు పాఠకుడికి లేదా శ్రోతకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కానప్పుడు మహిషాసురుడు, బలిచక్రవర్తి మొదలైనవాళ్ళు దళితుల ప్రతినిధులనీ, దుర్గాదేవి, వామనుడు మొదలైన దేవతలు బ్రాహ్మణవర్గంవారనీ హాస్యాస్పదమైన రచనలు రావడంలో ఆశ్చర్యంలేదు. సమాజంలోని మార్పుని తెలుసుకోవడం, విమర్శల ప్రభావాన్ని అవగాహన చేసుకోవడం, మన పుస్తకాల్లోని విషయాల్ని అందరికీ (ముఖ్యంగా విద్యార్థులకు) అందించడం పండితుల ముందున్న పని. పురాణకథల్ని చిలవలు పలవలుగా వర్ణించి పిల్లలకు చెప్పే స్థాయిలో కాక దార్శనిక దృష్టితో చెప్పినా పాఠకులు/శ్రోతలు సిద్ధంగానే ఉన్నారు, అదే సామాజిక అవసరం కూడా.

This article was first published in Andhra Jyoti, a Telugu daily and has been republished with permission.

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.

Aravinda Rao

The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.