ఒకవ్యక్తి –ఆరు మతాలు
హిందూమతంలో ప్రముఖంగా ఉండే మూడు సంప్రదాయాల్ని ప్రచారం చేసిన ఆచార్యులు శ్రీశంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు. వీరిపేర్లు మనలో చాలమందికి తెలుసు. చరిత్ర క్రమంలో వీరిలో మొదటివాడు ఎనిమిదవ శతాబ్దికి చెందిన శంకరాచార్యులు. ఆయన కేరళలో పుట్టాడు. కేవలం 32 సంవత్సరాలే జీవించాడు. ఆ స్వల్పకాలంలోనే దేశంలో సాక్షాత్తూ నలుమూలలూ తిరిగాడు. కేరళ నుండి కాశ్మీరదేశం వెళ్ళి అక్కడ పండితులతో వాదోపవాదాలు చేసి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కాడు. పశ్చిమంలో ద్వారకలోనూ, తూర్పున ఉన్న పూరీ నగరంలోనూ పీఠాల్ని ఏర్పాటుచేశాడు. ఆయన వ్రాసిన పుస్తకాలు అపారం. చాల మూలగ్రంథాలపై వ్యాఖ్యలు వ్రాశాడు. ఇవన్నీ సాధారణంగా తెలిసిన విషయాలే. అయితే అతనికి షణ్మతస్థాపకాచార్యుడు –అంటే ఆరుమతాల్ని స్థాపించినవాడు అనే పేరు ఉందని చాలమందికి తెలీదు. ఒకేవ్యక్తి ఆరుమతాల్ని స్థాపించడమేమిటి? ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.
మిగతా మతాల్లో లాగ హిందూమతంలో ఒక సంస్థాగతనిర్మాణం (Organizational Structure)లేకపోవడం వల్ల ఎవరికి వారే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి ఆచార్యులు, మహర్షులు అనుకునే ప్రమాదం ప్రాచీనకాలం నుండి ఉంది. పరమాత్మను ఏవిధంగానైనా ఉపాసన చేయవచ్చని ఉపనిషత్తులు కూడా స్వాతంత్ర్యం ఇచ్చాయి. అందువల్ల శంకరాచార్యుల కాలంనాటికే విచ్చలవిడి సంప్రదాయాలు సమాజంలో ఏర్పడ్డాయి. శివుడు, శక్తి, సూర్యుడు, విష్ణువు మొదలగు దేవతా స్వరూపాలన్నీ వేదాల్లో చెప్పినవే. ఇవన్నీ ఒకే తత్త్వంలో వివిధ కోణాలనుంచి చూస్తే వచ్చే పేర్లు. ఇందులో భరతఖండంలోని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడి ఆరాధన ప్రముఖంగా ఉండేది. ఉదాహరణకు కాశ్మీరదేశంలో శివుడి ఆరాధన, బెంగాల్ ప్రాంతంలో విష్ణువు ఆరాధన, ఒరిస్సా ప్రాంతంలో సూర్యుడు, తమిళదేశంలో షణ్ముఖుడు ఇలాగ. వీరిని ఉపాసన చేసే మార్గాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఉండేవి. మనిషి స్వభావాన్ని బట్టి కూడా పూజా పద్ధతులు ఉంటాయి. శ్రీకృష్ణుడు దీన్నే సాత్త్విక, రాజస, తామస విధానాలు అని గీతలో చెపుతాడు. సాత్త్వికులు శ్రద్ధ, భక్తి, నియమనిష్ఠలతో పూజచేసేవారు. రాజస గుణం ఉన్నవాళ్ళు కొంత డాంబికంగా, తీవ్రమైన ఫలాకాంక్షతో పూజించేవారు. తామస ప్రవృత్తి కలవాళ్ళు శాస్త్రవిరుద్ధంగా ఘోరమైన రీతిలో పూజలు చేసేవారు.
శంకరాచార్యుల కాలం నాటికి దేశంలో దాదాపు అరవై వరకూ విభిన్న సంప్రదాయాలు ఉండేవట. ఒకే దేవుణ్ణి వివిధ సంప్రదాయాల్లో, వివిధ రీతుల్లో పూజించేవారట. వీటిని ముఖ్యంగా దక్షిణాచారము, వామాచారము అనే పేర్లతో రెండు తరగతులుగా చెబుతారు. ఈ పదాల్ని ఈనాటి ఉదాహరణతో బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక పై ఆఫీసరు మన కార్యాలయం తనిఖీకి వచ్చినపుడు సంవత్సరం పాటు శ్రద్ధగా మనం చేసిన పనిని చూపించి మెప్పించడం అనేది దక్షిణాచారము. అలాకాకుండా పై ఆఫీసరుకు మద్యమాంసాదులు నైవేద్యం చేసి మంచి సర్టిఫికేట్ కొట్టడానికి ప్రయత్నించడం వామాచారము. దేవుడైనా, పై ఆఫీసరైనా మనిషి స్వభావం ఒకటే. అందువల్ల మనిషి మంచి ప్రవర్తన కలిగివుండి శ్రద్ధతో పూజించడం దక్షిణాచారం. శ్మశానాల్లో కూర్చుని మద్యమాంసాలు సేవిస్తూ, పూజ చేస్తున్నట్లు భావించుకోవడం వామాచారం.
శంకరాచార్యుల కాలంనాటికి ఇలాంటి వామాచారం అధికంగా ఉండేది. గణేశుడిని పూజించడంలో గణేశుడి బొమ్మపై మద్యాన్ని ఉమ్మి గణేశుడు తన భార్యతో రతిచేస్తున్నట్టు భావిస్తూ కొద్దిమంది గడిపేవారు. ఇది ఉచ్ఛిష్టగణపతి సంప్రదాయం. కాపాలికులు అనేది మరొక సంప్రదాయం. మనుషుల పుర్రెల్ని మాలగా మెడలో వేసుకుని శ్మశానంలోని బూడిదను ఒంటికి పూసుకుని తాము జ్ఞానులమంటూ తిరిగేవారు మరికొందరు. బొటనవ్రేలుని కోసుకుని ఆ రక్తంతో సూర్యుడికి తర్పణం చేసేవారు మరొకరు. ఒంటినిండా శూలాలు గుచ్చుకొని తిరిగేవారు మరొకరు. మరికొందరు మన్మధుణ్ణి పూజించేవారు. మరికొందరు కుబేర భక్తులు. కొందరు బేతాళుణ్ణి, భూతపిశాచాల్నీ వశంలో పెట్టుకునేవారు. వీళ్ళందరూ తీవ్రంగా ఉపాసన చేసేవారే. కానీ సమాజానికి సరియైన మార్గదర్శకం చేయడంలేదు. ఈ రీతిగా వెర్రితలలు వేస్తున్న సమయంలో నాస్తికవాదం కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది.
శంకరాచార్యులు ఇలాంటి వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఉపనిషత్తుల సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమని వాదించి అనేక దురాచారాల్ని మాన్పించాడు. దేశమంతటా గమనిస్తే ముఖ్యమైనవి ఆరు సంప్రదాయాలు ఉండేవి. అవి విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు, సూర్యుడు, షణ్ముఖుడు (కుమారస్వామి) అనే దేవతారూపాలకు చెందిన సంప్రదాయాలు. శంకరాచార్యులు వీటికి సంబంధించిన దక్షిణాచారాన్ని మాత్రం సమర్థించి వీరందరిపై స్తోత్రాలు వ్రాశారు. ఈయన స్తోత్రాలన్నీ వేదాంతపరంగా ఉంటాయి. ఆయా దేవుళ్ళను కేవలం కోరికలు కోరడం కాకుండా పరబ్రహ్మ స్వరూపాలుగా వర్ణించడం, తనకు సరైన జ్ఞానం, వైరాగ్యం ఇవ్వమని కోరడం ఈయన స్తోత్రాల్లోని ప్రత్యేకత. పై ఆరు ఆచారాల్ని సమర్థించి, ఆ ఆరు రూపాలు కూడా పరమాత్మ రూపాలుగా చెప్పడం వల్ల ఇతన్ని షణ్మతస్థాపకాచార్యుడు అన్నారు. కొత్తమతాన్ని దేన్నీ స్థాపించలేదు, ఉన్నవాటి మధ్య ఘర్షణలు లేకుండా సమన్వయం చేశాడు. ఈనాటి భాషలో చెప్పాలంటే ఈయన ఒక గొప్ప సంఘసంస్కర్త.
మనం నేడు కూడా దక్షిణభారత దేశమంతటా గమనించే పంచాయతనం అనే పద్ధతి శంకరాచార్యుల ప్రభావమే. పంచాయతనం అంటే ఐదు దేవతల్ని ఒకేచోట ఉంచి పూజించటం. ఉదాహరణకు విష్ణు దేవాలయం అంటే గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉండి, ప్రాకారం నాలుగు మూలలా మిగతా నలుగురు దేవుళ్ళు (శివుడు, గణపతి, శక్తి, సూర్యుడు) ఉండడం. శివుడి గుడి అంటే గర్భగుడిలో శివుడిని స్థాపించి మిగతా నాలుగు మూలలా మిగతా దేవుళ్ళు ఉండడం. దేవాలయాల్లోనే కాకుండా తమ తమ ఇండ్లలో పంచాయతన పూజ చేసుకునేవాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన దేవతా చిహ్నాన్ని (సాలగ్రామము లేదా లింగం మొదలైనవి) మధ్యలో ఉంచి మిగతా చిహ్నాల్ని చుట్టూ ఉంచడం. వివిధ సంప్రదాయాల మధ్య శత్రుత్వం లేకుండా అందరినీ గౌరవించే సంప్రదాయం సమాజంలో స్థాపించడానికి శంకరాచార్యుల ప్రచారమే ముఖ్యకారణం. పాశ్చాత్యదేశాల్లో లాగ పరమతదూషణ మనలో లేదు. వైష్ణవులు విష్ణువే దేవుడని చెప్పినా మిగతావారిని రాక్షసులంటూ దూషించలేదు. శైవులు శివుడే దేవుడని చెప్పినా విష్ణువును రాక్షసుడని దూషించలేదు. విభిన్న సంప్రదాయాలన్నింటినీ ఉపనిషత్తుల గొడుగు క్రిందికి తేవడం, వాటి మధ్య సంఘర్షణలు లేకుండా చేయటం శంకరాచార్యుల గొప్పదనం.
భిన్నత్వంలో ఏకత్వం చూడటం అంటే ఇదే. ఉపనిషత్తులు ఇలాంటి ఏకత్వాన్నే బోధిస్తాయి. ఈ వాతావరణం దాదాపు 14-15 శతాబ్దాల వరకూ కొనసాగినట్లు తెలుస్తుంది. క్రమక్రమంగా ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన బోధనలు బలహీనపడడం వల్ల శైవులు, వైష్ణవులు అనే పేరిట దక్షిణభారతదేశంలో కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు జరగడం దురదృష్టకరమైన పరిణామం. మన మూలగ్రంథాల్లో చెప్పిన ఉదారమైన, శాశ్వతమైన భావాల్ని సరిగా అర్థం చేసుకోవడం, చాటిచెప్పడం ప్రపంచ శాంతికి ఒకే ఒక మార్గం.
This article was first published in Andhra Jyoti, a Telugu daily and has been republished with permission.