Close

మన సంస్కృతికి మనమే వారసులం

మన సంస్కృతికి మనమే వారసులం

 

పురాణాల్ని చరిత్రగా వక్రీకరించి దేవతలంటే ఆర్యులనీ, రాక్షసులంటే శూద్రులనీ చెబుతూ మన సమాజంలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం యూరోపియన్లు అడుగుపెట్టిన కాలం నుండీ ఉన్నా ఇటీవల ఈ వక్రీకరణ మరీ వెర్రితలలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రాహ్మణిజం గూర్చి విమర్శలు మన మేధావుల నుండి వింటూనే ఉంటాం. పాపం వీరందరూ బయట ఎవరో వ్రాసిన పుస్తకాల్లోని మాటలే చెబుతూంటారు. అయితే ఈ పాశ్చాత్యుల రచనల్లో ఈమధ్య ఒక వింత వాదన వినిపిస్తోంది.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో లక్షలాది యూదుల్ని జర్మన్ దేశీయులు చంపడం తెలిసిందే. చాలమంది జర్మన్ పండితులు తమది ఆర్యజాతి అని చెప్పుకునేవారు,  సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేశారు. దీన్ని ఆధారంగా తీసుకొని వైదిక సంస్కృతి జర్మనులను బాగా ప్రభావితం చేసిందనీ,  ఆర్యజాతి శూద్రుల్ని అణచినట్లే జర్మన్లు యూదుల్ని అణచివేశారనీ, అంతటితో ఆగకుండా చంపారని Sheldon Pollock అనే మేధావి విశ్లేషణ. కుమారిల భట్టు అనే అతను వ్రాసిన పూర్వమీమాంస శాస్త్రం బ్రాహ్మణిజం భావజాలాన్ని పెంచిందనీ, ఆ భావజాలంతో ప్రభావితులై జర్మన్లు లక్షలాది యూదుల్ని చంపి సమర్థించుకున్నారని అతని వ్యాఖ్యానం. ఇంకొక రచయిత ఒక అడుగు ముందుకు వేసి హిట్లర్ కరడుగట్టిన మీమాంసకుడు అనవచ్చని వ్రాశాడు. ఈ రచనల్ని ఇటీవలే ప్రచురింపబడిన “The Battle for Sanskrit” అనే పుస్తకంలో (పేజీ-170) రాజీవ్ మల్హోత్రా అనే రచయిత ఉటంకించారు. ఆరు మిలియన్లు, అనగా అరవై లక్షల యూదుల్ని చంపిన క్రౌర్యాన్ని సమర్థించడానికి ఈ పండితులకు పూర్వమీమాంస పనికివచ్చింది. పూర్వమీమాంస కేవలం యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞవేదిక ఎలా ఉండాలి, ఎలాంటి ద్రవ్యాలు సేకరించాలి, ఏ సమయంలో సేకరించాలి, ఒకచెట్టు కొమ్మను తెంపినప్పుడు కూడా ఆ చెట్టుకు క్షమాపణ కోరుతూ ఏ మంత్రం చెప్పాలి. మొదలైన అనేక వివరాల్ని  చెప్పే శాస్త్రం. దీనికీ, అణచివేతకూ ఎలాంటి సంబంధమూ లేదు. మన మేధావులకు ఒక విజ్ఞప్తి. సమాజశాంతి మన అవగాహన పైనా, దాని ఆధారంగా జరిగే ప్రచారంపైనా ఆధారపడి ఉంది. పూర్వమీమాంస చదివి ఆ శాస్త్రం మన మనసుల్లో అణచివేత ధోరణులు పెంచుతుందా అని పరిశీలించుకుందాం.

అలాగే రామాయణాన్ని మనం అనాదిగా పారాయణం చేస్తున్నాం. రామాయణం చదివిన వాడెవ్వడూ తీవ్రవాది కాలేదు. రామాయణ ప్రసంగాలు చెప్పేవారెవ్వరూ తీవ్రవాదాన్నీ, లేదా అణచివేతనూ ప్రోత్సహించలేదు. కానీ షెల్డన్ పోలాక్ రామాయణాన్ని సామాజిక అణచివేతకు చిహ్నంగా వర్ణిస్తాడు. ఆయన రచనల్ని మన బాలబాలికలు అమెరికన్ విద్యాలయాల్లో చదువుతూ ఆత్మన్యూనతకు గురి అవుతూ ఉంటారు.

లాటిన్ లో ఉన్న బైబిల్ పై వ్యాఖ్య రాయాలంటే మన శాస్త్రులవారిని ప్రమాణంగా తీసుకోం. అలాగే అరబిక్ భాషలో ఉన్న ఖురాన్ గురించి వ్రాయాలంటే మరొక శర్మగారిని అడగం. కానీ మన వేదాల్నీ, శాస్త్రాల్నీ గూర్చి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న వ్యాఖ్యల్ని పక్కన ఉంచి ఆంగ్లమేధావులు తమ రచనల్నే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోనికి తేవడం ఒక ఆందోళన కరమైన పరిణామం. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో ఇస్లాం మతాన్ని చెప్పడానికి ఆ మతస్థుడే ఉంటాడు, బౌద్ధమతం చెప్పడానికి ఒక బౌద్ధుడే ఉంటాడు. కానీ ఇండియా గురించీ, లేదా హిందూమతం గురించీ చెప్పడానికి ఏ జర్మన్ దేశీయుడో, అమెరికన్ దేశీయుడో ఉంటారు. భారతీయులకు ప్రవేశమే లేదు. ప్రవేశం ఉండాలంటే అక్కడ ఇదివరకే ఉన్నవారి సిద్ధాంతాల్ని అంగీకరించాలి. సంస్కృతంపై పెత్తనం, తద్వారా మన సంస్కృతిపై పెత్తనం వారి చేతుల్లోనే ఉండాలని వారి ప్రయత్నం. దీనికి తగినట్టు మన పండితులు కూడా తమ ప్రపంచంలో తాము ఉండడం, సమాజంలో ఎలాంటి విషపూరిత భావాలు వస్తున్నాయనేది గమనించకపోవడం చాల శోచనీయం.

పై రచయితలు తమను తాము వామపక్ష భావాలు ఉన్నవారిగా ప్రకటించుకుంటారు. వామపక్షంవారు అన్ని మతాల్నీ ఒకే రీతిలో విమర్శించాలి. అయితే వీరు తమ మతంపై కానీ, వేరొక మతంపై కానీ పై చెప్పిన విధంగా విమర్శలు చేయడంలేదు. కాబట్టి వీరు నిజంగా వామపక్షవాదులా లేదా ఆ ముసుగులో ఉన్న మతఛాందసవాదులా అన్న సందేహం వస్తుంది.

అమెరికన్ మేధావులు దాదాపు సం. 1950 వరకూ భారతీయ సంస్కృతిని ఎంతో పొగుడుతూ వ్రాశారు. మన స్వతంత్ర పోరాట సమయంలో స్వతంత్ర ఉద్యమాన్ని సమర్థించారు. ముఖ్యంగా ప్రాచీన భారతీయ సంస్కృతి, తత్త్వశాస్త్రం గూర్చి Will Durant వ్రాసిన “Our Oriental Heritage” అనే పుస్తకం (ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది) మనందరం చదవాల్సిన గ్రంథం. Emerson, Thoreau లాంటివాళ్ళు వేదాంతాన్ని ఎంత ఆరాధించారో తెలిపే పుస్తకం Philip Goldberg వ్రాసిన “The American Veda”. దీన్నిగూర్చి ఇదివరకు ఒక పూర్తి వ్యాసంలో ప్రస్తావించాను. Stephen Knapp అనే మరొక అమెరికన్ విద్వాంసుడు వైదిక సంస్కృతి, మిగతా దేశాలపై దాని ప్రభావాన్ని గురించి ఈమధ్య చాల పుస్తకాలు వ్రాశారు. కానీ వీటిని విశ్వవిద్యాలయాల్లోని వ్యూహకర్తలు అంగీకరించడం లేదు.

విశ్వవిద్యాలయాలు భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఎందుకు వ్రాస్తున్నాయి, మనదేశంలో నడుస్తున్న భావజాల పోరాటాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి అని గమనిస్తే పాశ్చాత్య దేశాల్లో వస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇందుకు కారణం.  ఆ దేశాల్లో ప్రజలకు తమ మతంపట్ల ఆదరణ తగ్గిపోవడం, ఇతరమతాలు పెరగడం వారికి ఆందోళన కలగజేస్తోంది. Michael Lindsay అనే సామాజిక శాస్త్రవేత్త “Faith in the Halls of Power” (2007) అనే పుస్తకంలో దాదాపు నలభై సంవత్సరాలుగా అమెరికన్ సమాజంలో వస్తున్న మార్పుల్ని గూర్చి వ్రాశాడు. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో కూడా మతం ఎలాంటి పట్టు సంపాదించింది అని ఆయన చాల ఉదాహరణలతో వివరించాడు. ఈ పుస్తకాన్ని చూస్తే స్వేచ్ఛ, స్వాతంత్రాలకు ప్రతీకగా ఉన్న అమెరికా మతతత్త్వదేశంగా తయారవుతోందా అనే సందేహం కలగక మానదు. మతప్రచారకులే వామపక్ష రచయితల ముసుగులో విశ్వవిద్యాలయాల్లో ఉండవచ్చనే సందేహం కూడా కలగుతుంది. ఈ రచయిత ప్రసంగాలను కూడా యూట్యూబ్ లో వినగలం.

మల్హోత్రా వ్రాసిన “The Battle for Sanskrit” పుస్తకంలో ఇంకా ఆసక్తికర విషయాల్ని చూడగలం. సంస్కృతభాష కూడా ప్రజల్ని అణచడానికే వచ్చిన భాష అని చెప్పడం, యజ్ఞం మొదలైన కర్మలన్నీ సమాజంలో వర్ణవ్యవస్థను పటిష్ఠం చేయడానికి వచ్చినవనీ, ముస్లింలను అణచడానికి రామాయణాన్ని హిందూపండితులు ఉపయోగించుకున్నారనీ (పేజీ-182) ఇలాంటి ఎన్నెన్నో వింత వ్యాఖ్యానాల్ని ఈ పుస్తకంలో వివరించారు. ఇవన్నీ సంస్కృత పండితులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు.

This article was first published in Andhra Jyoti, a Telugu daily and has been republished with permission.

Disclaimer: The facts and opinions expressed within this article are the personal opinions of the author. IndiaFacts does not assume any responsibility or liability for the accuracy, completeness, suitability, or validity of any information in this article.

Aravinda Rao

The author is the former DGP of Andhra Pradesh and is a practitioner and teacher of Vedanta.