బాబా నేర్పిన తాండవ కేళి మహాత్మ్యము, మాతృభాషా గౌరవము
శివశక్తి స్వరూపుడు, సర్వేశుడు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు ప్రసాదించిన అనుగ్రహప్రేమతో నేర్చిన పాఠములలో మాతృభాషపై గౌరవము కూడా ఒకటి.
“మాతృభాషా వైభవము తెలియుటకు ఆ మహేశ్వరుడే దిగి రావాలా” అనిపిస్తోందేమో! కానీ నా జీవన యాత్రలో ఆంగ్లముపై నాకు కలిగిన ఆసక్తి తెలుగుపై అంతగా కలగలేదు. ఆ ఆసక్తి లోపం వలెనేనేమో తెలుగు భాష నాకు సులభముగా రాలేదు. ఆంగ్లములో నూటికి ఎనభై మార్కులు వస్తే తెలుగులో కేవలం అరవై మార్కులు, లేక ఇంకా తక్కువగా వచ్చేవి. “ది మర్చంట్ అఫ్ వెనిస్” సులభముగా గ్రహించేవాడిని కానీ పోతన భాగవతము నుండి పద్యములు పలుకుటకు కష్టపడేవాడిని. పదో తరగతి తరువాత తెలుగు చదివే అవసరము లేదని సంతోషించాను కూడా.
కానీ, అటువంటి సమయములో నా జీవితము పూర్తిగా మకాలే (Macaulay) మూర్ఖత్వములోనికి దిగజారిపోకుండా తల్లి, తండ్రి, గురువు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే నన్ను రక్షించారని చెప్పవచ్చును. బాబావారి బోధనలను మొదటిలో ఎక్కువగా ఆంగ్లములోనే చదివి, పరిశీలించి, అర్ధము చేసుకున్నా, వారి భారతీయతత్వము, మరియు వారి తెలుగుతనము, నన్ను చెట్టు మీద కూర్చున్న కాళిదాసుని పై దయ చూపిన తల్లిలాగ రక్షించినవి.
చిన్నతనంలో తల్లీ పెద్దలతో మాట్లాడిన ఆ తెలుగే నాకు మన తత్వము గురించి నేర్పినది. స్వామి వారి తెలుగులో ఉన్న ఉత్సాహము, తెలివి, ప్రేమ, అన్నియు గురుబోధన లానే భావించవచ్చును. స్వామి వారి ప్రసంగములే నాలో ధైర్యము నింపాయి. నేను ఆంగ్లములోనే వ్రాసినా, నాకు తెలిసినవి నా మాతృభాషలో ఉన్న భావములే అని, వాటిని గుర్తించి, గౌరవించి, ప్రచారించుటమే నా ధర్మము అని, నేర్చుకున్నాను.
అయితే, స్వామి వారి తెలుగుతనము, ఆ తెలుగైన భారతీయ తత్వముతో నిండిన ఒక అంశము గురించి ఇప్పుడు వివరిస్తాను.
2008 మహా శివ రాత్రి పండుగ రోజున స్వామి వారి దర్శనుము కోసము సాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) నుండి వచ్చాము. బెంగుళూరు నుండి పుట్టపర్తికి టాక్సీ లో వెళుతుండగా ఏవైనా శివుడి పాటలు వినాలని కోరికతో నా లాప్టాప్ కంప్యూటర్ని తీసి చూసాను. అందులో స్వామి వారు ఎన్నో సంవత్సరాలక్రితం గానం చేసిన పాట ఒకటి దొరికింది. ఆ పాటను మళ్ళీ మళ్లీ వింటూ ప్రశాంతినిలయం చేరుకున్నాము. మా నాన్నగారు మమ్మల్ని అక్కడ కలుసుకున్నారు. స్వామి వారి దర్శనముకు వెళ్ళినాము.
స్వామి వారు వీల్చైరులో వచ్చారు. నా ముందు నుండే వెళ్ళినారు. నన్ను పలుకరించలేదే అని కొంచము అనుకున్నాను. కానీ ఆ లక్షలాది భక్తజనసముద్రములో సమీప దర్శన భాగ్యము ప్రసాదించారు, అదియే చాలు, అనుకున్నాను. అప్పుడు స్వామి ప్రసంగమం మొదలు పెట్టినారు. ఆయాసముతో, కష్టపడుతూ, చాలా నెమ్మదిగా మాట్లాడినారు. వారి మాటలు అర్ధము అవుటకు కొంచము కష్టము అయినది. కాని, అర్థం అయిన వెంటనే స్వామి ప్రేమ, స్వామి కరుణ నాకు స్పష్టమైనది.
వారు మాట్లాడుటలేదు.. “తాండవ కేళి సల్పెనే,” అని మెల్లగా పాడు చున్నారు!
“పరమేశ్వరుడు సాంబశివుడు, తాండవ కేళి సల్పెనే !”
ఆ అద్భుతమయిన ప్రాచీన గీతము మేము టాక్సీలో నా లాప్టాప్లో విన్న గానమే!
ఆ మహా శివరాత్రి రోజున శివుని అఖండ నృత్యము గురించి సమస్త దేవుళ్లను తలచుచు, ఆ నృత్యము లోని ప్రతి అడుగుని శబ్దమణులతో అలంకరిస్తూ, ఋషులు, గణులు, నంది, నారదులు, అందరు చూచిన ఆ దివ్య దృశ్యమును ఆ విధముగా మాకు ప్రసాదించారు, స్వామి.
కానీ ఆ పాటతో అనుభవాలు అంతటితో ఆగలేదు. కొన్ని సంవత్సరముల తరువాత పెద్దలను, పండితులను ఆ పాట గురించి అడిగినాను. ఆ పాటని ఒకప్పుడు రచించినది మా మామగారి తాతగారు అయిన మహాకవి శ్రీ వేటూరి సుందర శాస్త్రి గారే అని తెలుసుకున్నాను. ఇలా అనూహ్యమైన విధముగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కుటుంబములోనే ఉన్న ఓ గొప్ప విషయమును మా అందరికి చూపించారు.
శివరాత్రి ప్రార్థనలతో ఇండియాఫాక్ట్స్ (IndiaFacts) పాఠకులకు ఈనాడు నేను ఈ “తాండవ కేళి” మాహాత్మ్యమును తెలియ చేయుచున్నాను. స్వామి వారు పాడిన ఈ అద్భుతమైన పాటను ఈ లింకులో విన వచ్చును: http://www.saibaba.ws/bhajans/tandavakeli.htm.