రక్షాబంధనము
ప్రతీసంవత్సరము శ్రావణమాసమున వచ్చే పౌర్ణమి నాడు ‘రక్షాబంధనము’ అను పండుగను ‘రాఖీ’గా భారతావనిన ఆడంబరముగ జరుపుకొను సదాచారము కలదు. శ్రావణపూర్ణిమనాడు అక్కాచెళ్ళెళ్ళందరు తమ తమ సహోదరులగు అన్నదమ్ములకు లేదా అన్నదమ్ములుగా భావించేవాళ్ళకి రాఖీ/రక్షాబంధనమును కట్టటం ఆనవాయితీగా వచ్చుచున్న ఆచారము. ఈ రక్షాబంధనము ఆడవారి రక్షణకు మగవారు బాధ్యతవహించుటకు ప్రతీకగా భావింపబడుచున్నది. అయితే భారతదేశములో కొన్ని ప్రాంతములలో ఊరిలోని పురోహితులు పురజనానికి రక్షాబంధనం చేయటం కనిపిస్తున్నది. అలాగే కొన్ని ప్రాంతాలలో భార్యలు భర్తలకు రక్షాబంధనం చేయటం కనిపిస్తున్నది. కానీ ఎక్కువశాతం అకాచెళ్ళెళ్ళు అన్నదమ్ములకు రక్షాబంధనం చేయటం కలదు. ఈ సదాచారము కేవలము ఒక సాంస్కృతికమయిన ఆచారమా లేదా సనాతన ధార్మికాచారమా అని తెలుసుకొనుట ఎంతో అవసరం.
రక్షాబంధనమునకు ప్రత్యేకముగ ధర్మశాస్త్ర గ్రంథములలో విధానము కలదు. ప్రతీ మాసములో వచ్చే ప్రత్యేక తిథులకు ఆచరించవలసిన వ్రతములను పండుగలను సవివరముగ తెలుపే ‘ధర్మసింధు’ ‘నిర్ణయసింధు’ ఇత్యాది గ్రంథములు మన భారతీయులకు ఉన్న అద్వితీయ నిధులు. ఈ గ్రంథములలో శ్రావణపూర్ణిమ నాడు ‘రక్షాబంధనమును’ ఆచరింపవలసినదిగా నిర్దేశింపబడి ఉన్నది.
రక్షాబంధనము – తద్విధానము
శ్రావణపూర్ణిమ నాడు పొద్దున్నే లేచి నిత్యకృత్యములను గావించుకునిన పిదప మధ్యాహ్నసమయయమున రక్షాబంధనము గావించవలెనని చెప్పియున్నారు. రక్షాబంధనము చేసే వేళ అనగా రాఖీని కట్టేటప్పుడు ఈ క్రింది శ్లోకమును ఉచ్చరించాలి –
“యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః।
తేనత్వామపి బధ్నామి రక్షే! మా చల మా చల॥”
ఈ శ్లోకమును వినగానే వచ్చే సంశయము – బలి చక్రవర్తికి రాక్షాబంధనమునకు ఉన్న సంబంధమేమిటని. ఈ సంశయనివృత్తికి భవిష్యపురాణములో తెలిపిన వృత్తాంతమును తెలుసుకొనవలె.
రక్షాబంధనము – పౌరాణికమూలము
భవిష్యపురాణములోని ఉత్తరపర్వములోని 137వ అధ్యాయములో రక్షాబంధనమును గూర్చిన విధానము గలదు. ధర్మరాజు కురుక్షేత్రసంగ్రామములో జయించిన తరువాత రాజుగా పట్టాభిషిక్తుడయిన పిదప వ్యాసాది మహర్షుల సమక్షములో తన మదిలోని సంశయమును వెలిబుచ్చాడు. అది ఏమనగా – కురుక్షేత్ర సంగ్రామములో తన జ్ఞాతులనేకులని సంహరింపవలసి వచ్చినది. జ్ఞాతవధ పాపకారకమని ధర్మశాస్త్రముచే తెలియనగుచున్నది. కావున తత్పరిహారమును తెలుపవలసినదిగా ధర్మరాజు మహర్షులను కోఱగా, వ్యాసమహర్షి శ్రీకృష్ణుని తత్పరిహామును తెలుపమని నిర్దేశించాడు. తన్నిర్దేశానుసారము శ్రీకృష్ణుడు అనేకములయిన వ్రతములను పరిహారములను తెలుపుతూ, ప్రతీ మాసములో ఆచరింపవలసిన కార్యములను కూడా ఉపదేశించాడు. దానిలో భాగముగా శ్రావణ పూర్ణిమనాడు ‘రక్షాబంధనము’ను ఆచరింపవలసినదిగ ఉపదేశించాడు.
పూర్వము ఒకానొక్కప్పుడు దేవతలకు అసురులకు యుద్ధము జరుగగా దేవతలచే అసురులు పరాభవింపబడ్డారు. ఆ పరాభవముచేత విగతస్పృహులయిన బలి చక్రవర్తి నాయకుడుగా కలిగిన ఆ అసురులు తమ కుల గురువయిన శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళి తమ శోకమును తెలిపినారు. వారి బాధను విన్న శుక్రాచార్యుడు యుద్ధములో జయాపజయములు దైవాధీనములు కనుక శోకము తగదని స్వాంతన కలుగజేసినాడు. పిదప వారి పరాభవమునకు కారణమును తెలియజేసాడు. అది యేమనిన ఇంద్రుని భార్య అయిన శచీదేవి తన భర్తకు ‘రక్షాబంధనుము’ చేయటం వలన ఇంద్రుడు యుద్ధములో అజేయునిగా నిలిచాడు. కాబట్టి సంవత్సరకాలము పాటు మీరు ఇంద్రునితో సంధి చేసుకోండి. రక్షాబంధనప్రభావముచేత సంవత్సరకాలము పాటు ఇంద్రుడను యుద్ధములో జయింపలేరు అని ఉపదేశించినాడు. అసురులు తమ గురూపదేశానుసారము ఇంద్రునితో సంధి చేసుకున్నారు. అట్టి మహిమాన్వితమయినది రక్షాబంధనమని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించినాడు.
మరి ఈ రక్షాబంధనమును కావింపవలసిన విధానమేనని ధర్మరాజడుగగా శ్రీకృష్ణుడు ఇట్లుపదేశించినాడు – శ్రావణపూర్ణిమనాడు పొద్దున్నే లేచి నిత్యకృత్యములు కావించుకుని మధ్యాహ్న సమయమున రాజు తన పరివారముతో గూడి మంగళప్రదేశమునందు ఉపావేశితుడయిన పిదప రాజపురోహితుడు రాజునకు ఈ క్రింది మంత్రమును ఉచ్చరించుచూ రక్షాబంధనమును కావించాలి –
“యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః।
తేనత్వామపి బధ్నామి రక్షే! మా చల మా చల॥”
ఈ శ్లోకార్థమేమనగ – ఏ రక్షాబంధనము చేత బలిచక్రవర్తి లాంటి మహాబలుడు ఇంద్రునిపై యుద్ధము చేయలేక బద్ధుడయినాడో అట్టి రక్షాబంధనమును నీకు కూడా కట్టుచున్నాను. అనగా నీవు కూడా ఇంద్రుని వలే అజేయునిగా ఉండు గాక. ఓ రక్షాబంభమా! వీనిని విడువకుము విడువకుము – అని.
ఈ రక్షాబంధనమును ఎవ్వరైనను ఆచరింపవచ్చును. రక్షాబంధమువలన సంవత్సరకాలముపాటు సర్వదోషరహితులగుదురని శ్రీకృష్ణుని ఉపదేశము. కాలక్రమేణ అక్కచెళ్ళెళ్ళు అన్నదమ్ములకు రక్షాబంధనము చేయుట ఆచారముగ మారినది. కాని ధర్మశాస్త్రమును చూచిన యడల ఎవ్వరైనను వారి వారి శ్రేయోభిలాషులకు రక్షాబంధనము కావించవచ్చును అని తెలియగుచున్నది.
కావున రక్షాబంధనము కేవలమూ ఒక సాంస్కృతిక కార్యముమాత్రమే కాదు సనాతన సంప్రదాయములోని ఒక ధార్మిక కార్యక్రమము కూడా.
Featured Image: NDTV