కర్మయోగం అంటే?
గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం అనే దానిని గూర్చి తెలుసుకుందాం.
ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీయోగం పట్టింది అంటూంటాం. లేనిదాన్ని పొందడం, పొందినదానిని రక్షించుకోవడం యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ఒక ప్రయోజనాన్నిపై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మ యొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం, దాని పర్యవసానాలు లేకుండా చూడటం. మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్ సోపు లాంటిదని చెపుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగః కర్మసు కౌశలం’ అంటాడు. ‘కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం’ అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలాకాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పని చేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది.
ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. ‘స్వకర్మణా తమభ్యర్చ్య’ అంటాడు శ్రీకృష్ణుడు.మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికీ, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తినిపూజించడం అంటే. పూర్వకాలం నియమాల (work division) ప్రకారం కేవలం అధ్యయనం, అధ్యాపనం, యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా. భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని వదిలి భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో ఆ సమయంలోఅతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెపుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం, వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. ‘అయ్యా!మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకు వచ్చాం కదా? నీవు ఎప్పుడూ నీ శస్త్రాలు పట్టుకునే ఉంటున్నావు, రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు? ఇవన్నీ ఎందుకు? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ధి కూడా కలుషితమవుతుంది కదా?’ అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్త్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం క్షత్రియుడి ధర్మంఅని వివరిస్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడంలేదు, కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది? కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి?
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా! కర్మఫలానికి నేనే కారణం, నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడడం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రధ్ధగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా ఛాయిస్ నీకుంది. దానిఫలంపై నీకు అధికారం, అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు, దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు. ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ, అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కూడా కర్మయోగమే.
This article was first published in Andhra Jyoti, a Telugu daily and has been republished with permission.
Featured Image: Khabar Nonstop